Vijayanagaram: కాంట్రాక్టర్లు ధరలు తగ్గించకపోతే రివర్స్ టెండరింగ్ కు వెళతాం: మంత్రి బొత్స
- గృహ నిర్మాణాలపై ధరలు తగ్గించుకోవాలని కోరాం
- రియల్ ఎస్టేట్ కంపెనీల కంటే ఎక్కువ ధరలా!
- ఇసుక కొరతపై బాధపడాల్సిన అవసరం లేదు
గృహ నిర్మాణాలపై కాంట్రాక్టర్లు ధరలు తగ్గించుకోకపోతే, రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం పట్టణ పరిధిలో పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ, గృహ నిర్మాణాల టెండర్లను అధిక ధరలకు గత ప్రభుత్వం అప్పగించిందని, వీటి ధరలు తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరామని చెప్పారు. ప్రభుత్వం సొంత భూములు ఇచ్చినా రియల్ ఎస్టేట్ కంపెనీల కంటే ఎక్కువ ధరలను నిర్ణయించి ఇచ్చారని విమర్శించారు. తక్కువ ధరలకే నాణ్యమైన గృహాలను నిర్మించి పేదలకు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత గురించి బొత్స స్పందిస్తూ, ఈ విషయమై బాధ పడాల్సిన అవసరం లేదని, నిర్మాణాల నిమిత్తం అవసరమైన ఇసుకను ప్రజలకు కేటాయించాలని, కొత్తగా ఇసుక రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.