bogatha waterfall: బొగత జలపాతం ఉగ్రరూపం...సందర్శకులు రావద్దని అటవీ శాఖ సూచన
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4b72317e077aa896970193509e3e9cffbcf7203d.jpg)
- కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం
- సమీపంలోకి అనుమతించమని ప్రకటన
- మద్యం సేవించి వచ్చే వారికి ప్రవేశం నిషిద్ధం
తెలంగాణ రాష్ట్రంలోని బొగత జలపాతం ఉగ్రరూపంతో ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజీడు మండలం కోయవీరపురం సమీపంలో ఉన్న ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జలపాతంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రకృతి సౌందర్యానికి పేరొందిన ఈ ప్రాంతానికి నిత్యం వందలాది మంది సందర్శకులు తరలివస్తుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం చీకుపల్లి ప్రవాహంలో నీటి ఉద్ధృతి అధికంగా ఉండడంతో బొగత జలపాతం ప్రమాదకరంగా ఎగసిపడుతోందని, అందువల్ల సందర్శకులు రావద్దని అటవీ శాఖ కోరింది.
‘ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉంది. తగ్గే వరకు పర్యాటకులు రాకపోవడం మంచిది. ఒకవేళ తెలియక వచ్చిన వారు మా సూచనల మేరకు ఫెన్సింగ్ దాటి వెళ్లకూడదు. మద్యం సేవించి వచ్చే వారిని ఫెన్సింగ్ వరకు కూడా అనుమతించం. ఈ విషయంలో సందర్శకులు సహకరించాలి’ అంటూ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.