f16: పాకిస్థాన్ కు సహకరిస్తున్న అమెరికా.. భారత్ ఆందోళన
- పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా
- అమెరికా రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసిన భారత్
- ట్రంప్ పాలకవర్గం దృష్టికి కూడా తీసుకెళ్లిన భారత్
పాకిస్థాన్ కు 125 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ, పాకిస్థాన్ కు సైనిక సహకారం అందించడంపై భారత్ ఆందోళనను అమెరికాకు తెలియజేశామని చెప్పారు. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారితో పాటు వాషింగ్టన్ లోని ట్రంప్ పాలకవర్గం దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.
మరోవైపు, ఇది కేవలం ఎఫ్-16కి సంబంధించిన సాంకేతిక సహకారం, అదనపు హంగులు, శిక్షణ, పర్యవేక్షణకే పరిమితమని అమెరికా చెబుతోంది. సైనిక సహకారం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. యుద్ధ విమానాల విక్రయానికి, దానికి సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా నిర్ణయం పట్ల అమెరికా రాయబారిని సౌత్ బ్లాక్ కు పిలిపించి భారత్ నిరసన వ్యక్త చేసినట్టు కూడా తెలుస్తోంది.