Nadigar Sangam: నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
- జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికల నిర్వహణ
- పిటిషన్ దాఖలు చేసిన సహాయ నటుడు బెంజమిన్
- విచారణ ఆగస్టు 8కి వాయిదావేసిన హైకోర్టు
అనేక వివాదాలు, ఉద్రిక్తతల మధ్య జరిగిన తమిళనాడు నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. బెంజమిన్ అనే నటుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. సేలంకు చెందిన బెంజమిన్ కు కూడా నడిగర్ సంఘంలో సభ్యత్వం ఉంది. అయితే, పోలింగ్ కు ఒకరోజు ముందు తనకు పోస్టల్ బ్యాలెట్ అందిందని, దాంతో తాను ఓటు వేయలేకపోయానని బెంజమిన్ తన పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, ఇతర సభ్యులను ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 8కి వాయిదావేశారు. జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినా, వివాదాల కారణంగా ఫలితాలు ఇప్పటికీ వెలువడలేదు.