Andhra Pradesh: కేంద్రానికి జగన్ ప్రభుత్వం ఓ లేఖ రాస్తే రామాయపట్నం పోర్టు వస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • దుగరాజపట్నంలో పోర్టు ఆచరణ సాధ్యం కాదు
  • ఇందుకు ప్రత్యామ్నాయం రామాయపట్నం
  • కేంద్రం చొరవ తీసుకోవడంలో తప్పులేదు

ఏపీలో రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ, అది ఆచరణలో సాధ్యం కాదని, మూడేళ్ల క్రితమే ఏపీలో గత ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందని అన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయం సూచించాలని చంద్రబాబునాయుడిని కేంద్రం కోరినా ఆయన స్పందించలేదని విమర్శించారు.

కాబట్టి, ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదించి దుగరాజపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో పెద్ద ఓడరేవు నిర్మించాలని ఈరోజు జీరో అవర్ లో తాను ప్రతిపాదించినట్టు చెప్పారు. ఇక్కడ పెద్ద ఓడరేవు వస్తే దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

అంతేకాకుండా, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని అన్నారు. గత ప్రభుత్వం దీన్ని విస్మరించిందని, అందుకు కారణమేంటో తెలియదని అన్నారు. రామాయపట్నంలో ఓడ రేవు నిర్మాణానికి సమ్మతమేనని చెబుతూ ఓ లేఖ ఇవ్వమని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని అన్నారు.

ఇప్పటికైనా, ఈ విషయమై జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాస్తే రామాయపట్నంలో పోర్టు నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తే, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని, ఇందులో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh
Bjp
Mp
GVL
cm
Jagan
  • Loading...

More Telugu News