Andhra Pradesh: రైతులను మోసం చెయ్యబోయిన జగన్ ‘సున్న’ అయ్యారు: జగన్ పై లోకేశ్ విమర్శలు
- రైతులకు సున్న వడ్డీ రుణాలు ఇస్తామన్నారు!
- అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారు, మడమ తిప్పారు
- మా హయాంలో రైతులకు రూ.630 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం
ఏపీలో రైతులకు సున్న వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ మాట తప్పారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రైతులకు సున్నా వడ్డీ రుణాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మాట మార్చి, మడమ తిప్పారని విమర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, మొట్టమొదటిసారి వైఎస్ఆర్ సున్న వడ్డీ రుణాలు అంటూ రైతులను మోసం చెయ్యబోయిన జగన్ సున్న అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘చంద్రబాబు గారి హయాంలో మేమిచ్చాం' అని టీడీపీ అంటే, 'ఇవ్వలేదని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా?' అని చంద్రబాబుతో జగన్ ఛాలెంజ్ చేశారని, ఆ మరుసటి రోజే తన నోటితోనే టీడీపీ హయాంలో రూ.630 కోట్ల వడ్డీలేని రుణాలను రైతులకు ఇవ్వడం జరిగిందని జగన్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇంతా చేసి, రూ.3,500 కోట్లతో వడ్డీ లేని రుణాలు ఇస్తానన్న పెద్ద మనిషి, బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించారని, ’జగన్ గారి మాట మార్చడం, మడమ తిప్పడం ఇలా ఉంటుందన్న మాట’ అని సెటైర్లు విసిరారు.