Puri: పూరీ జగన్నాథుడి బాడీగార్డ్ మామూలోడు కాదు!
- కండలతో విశేషంగా ఆకర్షించిన అనిల్ గొచీకర్
- బాడీబిల్డింగ్ లో అంతర్జాతీయ ఖ్యాతి
- శాకాహారంతోనే కండలు పెంచిన వైనం
ఇటీవల సోషల్ మీడియాలో పూరీ జగన్నాథుడి రథోత్సవం సందర్భంగా ఓ కండలరాయుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. కఠినశిలను ఉలితో చెక్కినట్టుగా ఉన్న అతడి శరీర సౌష్టవం చూసి జనాల మతులుపోయాయి! దాంతో అతడు ఎవరంటూ నెటిజన్లు విపరీతమైన ఆసక్తి ప్రదర్శించారు. అతడి పేరు అనిల్ గొచీకర్. పూరీ జగన్నాథ ఆలయ పూజారి కుమారుడు. అంతేకదా అనుకోవద్దు.
అనిల్ ఓ బాడీ బిల్డర్ కూడా. అలాంటిఇలాంటి బాడీబిల్డర్ కాదు, మిస్టర్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ఇంతజేసీ మనోడు పూర్తిగా శాకాహారి. అనిల్ ప్రత్యేకత ఏంటంటే, అతడు 30 ఏళ్ల వయసులో తొలిసారిగా జిమ్ లో అడుగుపెట్టాడు. ఆ వయసులో జిమ్ కెళ్లడం ఓ ఎత్తయితే, కొద్దికాలంలోనే కొండల్లాంటి కండలు పెంచడం మరో ఎత్తు.
పూరీ జిల్లాలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అనిల్ తండ్రి పూరీ జగన్నాథ మందిరంలో పండిట్ గా పనిచేశారు. 2006లో ఆయన మరణించారు. అయితే, వంశపారపర్యంగా వస్తున్న పూరీ జగన్నాథుడి సేవను మాత్రం గొచీకర్ కుటుంబసభ్యులు మరువలేదు. తండ్రి అనంతరం ఆ బాధ్యతలను అనిల్ తాను స్వీకరించాడు.