Arvind Kejriwal: ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ సరికొత్త వరం!
- 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
- ఆపై 400 యూనిట్ల వరకూ రాయితీ
- ప్రజలకు మేలు కలుగుతుందన్న కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు సరికొత్త వరాలను ప్రకటించారు. ఢిల్లీ పరిధిలోని ప్రతి కుటుంబానికీ నెలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 200 యూనిట్లకు పైబడి, 400 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఖర్చు చేసే వారికి 50 శాతం రాయితీని కూడా ఇస్తామని పేర్కొన్నారు.
ఈ ఉదయం ఆయన మాట్లాడుతూ, దేశం మొత్తంలోనే అత్యంత చౌకగా విద్యుత్ లభిస్తున్న రాష్ట్రం ఢిల్లీయేనని అన్నారు. ఉచిత విద్యుత్ నిర్ణయం చారిత్రాత్మకమని, సామాన్యుడికి ఎంతో ఊరటను కలిగిస్తుందని అన్నారు. ఢిల్లీలోని వీఐపీలు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు ఉచితంగా విద్యుత్ ను వాడుకుంటున్నారని, ఇదే సమయంలో సామాన్యుల నుంచి విద్యుత్ బిల్లులను వసూలు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తన నిర్ణయంతో ఢిల్లీలో నివసిస్తున్న 33 శాతం కుటుంబాలకు వేసవిలో, 70 శాతం కుటుంబాలకు శీతాకాలంలో మేలు కలుగుతుందని తెలిపారు.