Crime News: రవిశేఖర్ సామాన్యుడు కాదు...బాలికను కిడ్నాప్ చేసినా కించిత్తు భయంలేకుండా తిరిగాడు
- దొంగిలించిన కారులోనే ఎక్కువ సమయం
- నంబర్ ప్లేట్లు మార్చుతూ హల్‌చల్
- పరారీలో ఉంటూనే మోసాలు
హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైనా అందుకు బాధ్యుడైన రవిశేఖర్ లీలలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుంటే పోలీసులకే నమ్మశక్యం కావడం లేదు. ఓవైపు తనకోసం పోలీసులు వేటాడుతున్నారని తెలిసినా కించిత్తు భయం, ఆందోళన లేకుండా తన మోసాల పరంపరను అతను కొనసాగించడం విశేషం.
ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఆమెను అద్దంకి బస్‌స్టేషన్‌లో హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తనకోసం మాటువేసిన రాచకొండ పోలీసులకు చిక్కాడు. ‘తీగ లాగితే డొంక కదిలింది’ అన్న చందంగా రవిశేఖర్ మోసాల లిస్టు చూసిన పోలీసులే బిత్తరపోతున్నారు. కర్ణాటక జిల్లా బళ్లారిలో ఐ20 కారును దొంగిలించిన రవిశేఖర్ దాని నంబరు ప్లేట్లు మార్చుతూ అందులోనే తిరుగుతున్నాడు. ఈ కారులోనే బాధితురాలిని అపహరించాడు.
తొలుత విద్యార్థినిని, ఆమె తండ్రి, సోదరుడిని కారు ఎక్కించుకున్నాడు. ధ్రువపత్రాల జిరాక్స్ కోసం తండ్రి, సోదరుడు కారు దిగి వెళ్లగానే బాలికతో వుడాయించాడు. అనంతరం ఆమెను కారులోనే ఉంచి చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో సంచరించాడు. మధ్యలో నల్గొండ జిల్లాకు వచ్చి ఓ ఎరువుల దుకాణంలో దోపిడీకి కూడా పాల్పడడం విశేషం. ఇన్ని చేసినా పోలీసులు తనకోసం వేటాడుతున్నారన్న విషయం అతనికి తెలియదట.
రాచకొండ పోలీసులు బృందాలుగా విడిపోయి వేటాడుతున్నా, ఆ విషయం మీడియాలో విస్తృతంగా వస్తున్నా కారులో తిరుగుతుండడం వల్ల టీవీ చూసే అవకాశం లేకపోవడంతో అతనికీ విషయం తెలియదని అంటున్నారు. రవిశేఖర్ ఫోన్ కూడా వాడక పోవడం, బాలిక వద్ద కూడా ఫోన్ లేకపోవడంతో ఎటువంటి సమాచారం లేకుండా పోయింది.
బాలికను కారులోనే తిప్పుతూ ఆమె తండ్రి మన వద్దకే వస్తున్నాడని చెప్పి నమ్మించడంతో ఆమె కూడా ఏమీ అనలేదు. దీంతో రవిశేఖర్ కిడ్నాప్ వ్యవహారం సాఫీగా సాగిపోయింది. కాగా, రవిశేఖర్‌పై దాదాపు 30 కేసులు ఉన్నట్లు సమాచారం. గతంలో జనవరిలో తాడేపల్లిగూడెం పోలీసులను బురిడీకొట్టించి, మేలో విశాఖ బస్టాండ్ నుంచి తప్పించుకున్నాడు.