Motor Vehicles Bill: వాహనదారులకు ముచ్చెమటలు పట్టించే మోటార్ వెహికల్ బిల్లు వచ్చేస్తోంది.. బిల్లులో ఏముందో చూడండి!

  • రాజ్యసభ ఆమోదం పొందిన మోటార్ వెహికల్స్ బిల్లు
  • లోక్ సభకు వెళ్లనున్న బిల్లు
  • ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వారికి వెన్నులో వణుకు పుడుతుందన్న గడ్కరీ

మన దేశంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠినమైన చర్యలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలు మాత్రమే ఉండటంతో... రూల్స్ ను చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాజ్యసభలో నిన్న ప్రవేశపెట్టిన మోటార్ వెహికల్స్ (సవరణ) బిల్లుకు ఆమోదం లభించింది. గత సమావేశాల్లోనే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినా... సభ రద్దవడంతో అది మురిగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి లోక్ సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ బిల్లు ఆమోదం పొందగానే చట్ట రూపం దాల్చనుంది.

ఈ సందర్భంగా, రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించేవారి వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులను కంప్యూటరీకరణ చేస్తామని తెలిపారు. మంత్రి అయినా, ఎంపీ అయినా ఆన్ లైన్ టెస్ట్ పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని చెప్పారు.

ఈ బిల్లులో ఉన్న అంశాలలో 10 ప్రధాన అంశాలు ఇవే:
  • మొబైల్ లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం, ట్రాఫిక్ లైట్స్ ను జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడాన్ని డేంజరస్ డ్రైవింగ్ గా పరిగణిస్తారు.
  • అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ. 10వేల జరిమానా. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 1 లక్ష వరకు ఫైన్.
  • పరిమితికి మించిన వేగంతో వెళ్తే వెయ్యి నుంచి 2 వేల వరకు జరిమానా.
  • వాహనానికి ఇన్స్యూరెన్స్ లేకపోతే రూ. 2 వేల ఫైన్. హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ. 1 వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్.
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందేంత వయసు రాని అండర్ ఏజ్ వాళ్లు వాహనాన్ని నడిపితే... వారి గార్డియన్ ను కానీ, వాహన యజమానిని కానీ నిందితుడిగా పరిగణిస్తారు. దీనికి రూ. 25 వేల భారీ జరిమానాను విధిస్తారు. అంతే కాదు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. దీనికి తోడు వాహన రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.
  • ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ అధికారులతో వాదనకు దిగితే కనీసం రూ. 2 వేల ఫైన్ వేస్తారు.
  • లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5 వేల జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినవారు వాహనాన్ని నడిపితే రూ. 10 వేల ఫైన్ విధిస్తారు.
  • డేంజరస్ డ్రైవింగ్ చేసే వారికి విధించే ఫైన్ వెయ్యి నుంచి 5 వేల రూపాయలకు పెరుగుతుంది.
  • డ్రంకెన్ డ్రైవ్ చేస్తే రూ. 10 వేల జరిమానా విధిస్తారు.
  • ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలకు రూ. 20 వేల పెనాల్టీ.

  • Loading...

More Telugu News