Cambridge International School: ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థి.. స్కూలు ఫీజులో 50 శాతం వెనక్కి ఇచ్చేయమన్న వినియోగదారుల ఫోరం
- కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలుకు ఫోరం మొట్టికాయలు
- అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూల్లో నాసిరకం విద్యపై విస్మయం
- విద్యార్థికి అనుకూలంగా ఆదేశాలు
తీసుకున్న స్కూలు ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి వెనక్కి ఇచ్చేయాల్సిందిగా పంజాబ్‌లోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఓ సాధారణ విద్యాసంస్థలో చేరేందుకు రాసిన ప్రవేశపరీక్షలో తమ కుమారుడు ఫెయిలవడంతో విద్యార్థి తల్లి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది.
తన కుమారుడు చదువుకున్న కేంబ్రిడ్జి స్కూలులో సరైన విద్య అందకపోవడం వల్లే అతడు ఫెయిలయ్యాడని ఆరోపిస్తూ బాలుడి తల్లి ప్రియాంక ఈ ఏడాది ఏప్రిల్ 19న ఫిర్యాదు చేసింది. స్కూలు ఫీజు కింద రూ.1.75 లక్షలు చెల్లించానని తెలిపింది. ఇంటర్నేషనల్ స్కూలు అన్న కారణంతోనే చదివించానని పేర్కొంది. ప్రోగ్రెస్ కార్డులో మంచి మార్కులే వేసేవారని, కానీ వేరే స్కూల్లో తన కుమారుడిని చేర్చాలనుకున్నప్పుడు స్కూలు బండారం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మూడేళ్ల తర్వాత ఓ సాధారణ స్కూల్‌లో చేర్పించాలనుకున్నానని, ఇందుకోసం ఆ స్కూలు యాజమాన్యం పెట్టిన ప్రవేశ పరీక్షలో తన కుమారుడు ఫెయిలయ్యాక కేంబ్రిడ్జి పాఠశాల అందించిన విద్య ఏపాటిదో అర్థమైందని వాపోయింది. తాను చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా వేడుకుంది.
ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న స్కూలులో చదువుకున్న విద్యార్థి సాధారణ స్కూలు ఎంట్రన్స్‌లో పాస్ కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. మూడేళ్లపాటు విద్యార్థి నుంచి వసూలు చేసిన 1.75 లక్షలలో 50 శాతాన్ని వెనక్కి ఇవ్వాలని స్కూలును ఆదేశించింది. అలాగే, వారు అనుభవించిన మానసిక క్షోభకు రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మూడు వేల రూపాయలను నెలలోపు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, మరో ఐదు వేల రూపాయలను లీగల్ ఎయిడ్ ఫండ్ కింద డిపాజిట్ చేయాలని స్కూలు యాజమాన్యాన్ని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది.