Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలులో 27 మందికి హెచ్ఐవీ... తీవ్రంగా స్పందించిన హైకోర్టు!
- ఖైదీలకు సాధారణ వైద్య పరీక్షలు
- హెచ్ఐవీ సోకినట్లుగా నిర్ధారణ
- సూపరింటెండెంట్ పై కోర్టు ఆగ్రహం
రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తక్షణమే వారికి జరిపించిన వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. వారిలో ఏ ఒక్కరికైనా జైలుకు వచ్చిన తరువాత హెచ్ఐవీ సోకినట్టుగా నిర్ధారణ అయితే, జైలు సూపరింటెండెంట్ పై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా, ఇటీవల రాజమండ్రి జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 27 మందికి ప్రాణాంతక వైరస్ సోకినట్టు వెల్లడైంది. దీంతో జైలు అధికారులు సైతం తీవ్ర ఆందోళనకు లోనుకాగా, ఈ విషయంలో ఖైదీల బంధువులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ ఎలా సోకిందని ప్రశ్నించింది. వీరిలో కొందరు ఏళ్ల తరబడి జైలులో మగ్గుతున్నవారు కూడా ఉన్నారని తెలుసుకున్న కోర్టు, తక్షణం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.