Anna canteenlu: ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన అన్న క్యాంటీన్లు

  • నిన్న మధ్యాహ్నం తర్వాత తట్టాబుట్టా సర్దేసిన నిర్వాహకులు
  • ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు లేకే
  • మూసేది లేదని మంత్రి బొత్స చెప్పినా మాట నిలవలేదు

నిరుపేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో నవ్యాంధ్ర వ్యాప్తంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్లు’ బుధవారం రాత్రితో మూతపడ్డాయి. మధ్యాహ్నం భోజనాన్ని యథావిధిగా సరఫరా చేసిన నిర్వాహకులు ఆ తర్వాత తట్టాబుట్ట సర్దుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలియని జనం ఎప్పటిలాగే రాత్రి ఏడుగంటల  సమయంలో ఆయా క్యాంటీన్ల వద్దకు చేరుకుని మూతపడి ఉండడంతో నిరాశతో వెనుదిరిగారు.

గత ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73 పట్టణాలు, నగరాల్లో ఒకేసారి 203 అన్న క్యాంటీన్లను తొలివిడత ప్రారంభించిన విషయం తెలిసిందే. డిమాండ్‌ను అనుసరించి వీటి సంఖ్యను ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో పెంచుకుంటూ పోయారు.

రోజుకి దాదాపు 3 లక్షల మందికి ఈ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసేవారు. పూటకు ఐదు రూపాయలకే ఆహార పదార్థాలు సరఫరా చేయడంతో  నిరుపేదలు, రోజు కూలీలు, హమాలీలు, చిరు వర్తకులు ఎక్కువమందికి క్యాంటీన్లు ఉపయోగపడ్డాయి.

క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను 'అక్షయ పాత్ర ఫౌండేషన్‌'కు అప్పగించారు. గడచిన ఎనిమిది నెలల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన అన్న క్యాంటీన్లను ఆగస్టు ఒకటి నుంచి మూసివేస్తున్నారన్న ప్రచారం నాలుగు రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యింది. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అక్షయపాత్ర సంస్థ కాంట్రాక్టు గడువు జూలై 31తో ముగుస్తుండడం, ఫౌండేషన్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి పొడిగింపు ఉత్తర్వులు అందకపోవడంతో మూసివేత ఖాయమనుకున్నారు.

అయితే రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఈ అంశంపై స్పందిస్తూ క్యాంటీన్ల మూసివేత ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని ప్రకటించడంతో ఊరట చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వడ్డించిన అక్షయపాత్ర సంస్థ సిబ్బంది రాత్రి భోజనం సమయానికి మాత్రం సామాన్లను మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు అప్పగించి క్యాంటీన్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కాగా, క్యాంటీన్ల కొనసాగింపు ఉత్తర్వులు ఈరోజు వెలువడతాయని అధికారులు చెబుతున్నా ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.

Anna canteenlu
closed
akshayapaatra foundation
no information from gov
  • Loading...

More Telugu News