USA: పదేళ్ల తరువాత వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా... ప్రపంచ మార్కెట్లు డౌన్!
- 2008 తరువాత పావు శాతం వడ్డీ రేట్ల కోత
- భవిష్యత్తులో మరిన్ని రేట్ కట్స్ ఉంటాయన్న జెరోమ్ పావెల్
- ట్రంప్ ఒత్తిడితోనే నిర్ణయం తీసుకున్నట్టు అనుమానం
- ఒక శాతం నష్టంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ
దాదాపు దశాబ్ద కాలం తరువాత యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడచిన ఏడాది కాలంగా వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని తీసుకు వస్తున్న ఒత్తిడితోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక దృక్పథం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ప్రపంచ పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నామని, ఇకపై వడ్డీ 2 నుంచి 2.25 శాతం మధ్యే ఉంటుందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ కట్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించడం గమనార్హం. దీన్ని కేవలం 'మిడ్ సైకిల్ ఎడ్జస్ట్ మెంట్' మాత్రంగానే చూడాలని ఆయన అన్నారు.
కాగా, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలోకి వెళ్లాయి. బుధవారం నాటి నాస్ డాక్ 1.19 శాతం పతనమైంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో హాంగ్ సెంగ్ 0.79, తైవాన్ మార్కెట్ 0.83, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.06, సెట్ కాంపోజిట్ 0.26 శాతం, షాంగై కాంపోజిట్ 0.82 శాతం నష్టాల్లో నడుస్తుండగా, ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇప్పటికే 0.61 శాతం నష్టాలను చూపుతోంది.
ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న వాణిజ్య పరమైన నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలను క్లిష్టతరం చేశాయి. ఈ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.