YSRCP: వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడికి 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
- కారును ఆపిన కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే కుమారుడి వీరంగం
- ట్రాఫిక్ సీఐని కాలితో తన్నిన సామినేని ప్రసాద్
- అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
హైదరాబాద్, మాదాపూర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకుని కాలితో తన్నిన వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణప్రసాద్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గత నెల 29న రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్ స్కైలాంజ్ సమీపంలో తన కారును అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కృష్ణతో ఎమ్మెల్యే కుమారుడు వాగ్వివాదానికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ రాజగోపాల్‌రెడ్డి ఆయనను వారించే ప్రయత్నం చేశాడు. అయినా వినిపించుకోని ఆయన సీఐని నెట్టేస్తూ కాలితో తన్నాడు. దీంతో సీఐ రాజగోపాల్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సామినేని ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనను 12వ ఏఎంఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ప్రసాద్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.