Chandrababu: దటీజ్ చంద్రబాబు గారు: నారా లోకేశ్
- చంద్రబాబు హయాంలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటు చేశాం
- వైసీపీ వాళ్లకు అవగాహన లేదు
- అందుకే, 'ఒక మయసభ' అంటూ విమర్శించారు
చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన హయాంలో స్థాపించిన వ్యవస్థలు ఏపీని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాయనడానికి ఏపీ మెడ్ టెక్ జోన్ ఓ ఉదాహరణ అని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖను దేశంలోనే మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ మెడ్ టెక్ జోన్ ను డిసెంబర్ 2018లో చంద్రబాబు ప్రారంభించారని అన్నారు.
అవగాహనలేని, విలువ తెలియని వైసీపీ వాళ్లు 'ఒక మయసభ' అంటూ హేళన చేసిన ఏపీ మెడ్ టెక్ జోన్ గురించి, కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్ వేదికగా ప్రశంసలు కురిపిస్తే, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్రముఖులు ఆయనతో ఏకీభవిస్తూ చేసిన వ్యాఖ్యలను చూడండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్, ‘దటీజ్ చంద్రబాబు గారు’ అని ప్రశంసించారు.
ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ సాధించింది ఏంటంటే, ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా మైకులు తీసేసి, తమను నిలదీసిన ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయడమని విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గాలి లేఖలు, అబద్ధాల బుడగలతో, అనిల్, అంబటిల హావభావాలతో ప్రజలను నవ్విస్తూ తమ పాలన ఇంతే అని వైసీపీ చెప్పగలిగిందని సెటైర్లు విసిరారు.