Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహ్యం మొదలైంది: నారా లోకేశ్
- రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించారు
- రానున్న ఐదేళ్లూ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదు
- పెద్దాయన వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి, టీడీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అసహ్యం మొదలైందని, రానున్న ఐదేళ్లూ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ప్రజలే స్వయంగా చెపుతున్నారని వ్యాఖ్యానిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ఓ పెద్దాయన వీడియోను తన పోస్ట్ లో లోకేశ్ పొందుపరిచారు.
ఆంధ్రా పరిస్థితి ఏమీ బాగోలేదని, ప్రజలు చాలా మంది అసహ్యంగా చెప్పుకుంటున్నారని ఆ వీడియోలో పెద్దాయన విమర్శించారు. గత ఐదేళ్లలో టీడీపీ అభివృద్ధి చేసిందని, ఇంకో ఐదేళ్లు టీడీపీనే అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు. కొత్త కంపెనీలు వచ్చేవని, యువతకు అవకాశాలు లభించేవని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే మన రాజకీయనాయకులు కష్టపడాలని సూచించారు.ఈ ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని ఆయన అన్నారు.