YSRCP: జగన్ పై కేసులు లేకపోతే తిరిగే వారు కాదు.. కూర్చునే రాజకీయం చేసేవారు: పవన్ కల్యాణ్
- ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారు
- చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా?
- వీళ్లెవరూ తిరగరు
నాయకులు ప్రజల మధ్య ఉండాలని, ప్రతిరోజూ ప్రజలను కలిసేందుకు తిరగాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరానికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? వీళ్లెవరూ తిరగరని విమర్శించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ను సీఎం చేయాలని నాడు ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకున్నారని, అలా జరగలేదు కనుక జగన్ రోడ్లపై తిరిగి కష్టపడ్డారని, ఆ కష్టాన్ని తానేమీ కాదనడం లేదని అన్నారు.
'నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అభిమానులు నన్ను తిరగనిస్తారా?’ అని ప్రశ్నించారు. తన చొక్కానే కాదు, తన శరీరాన్నీ ముక్కలు ముక్కలుగా అభిమానులు పీక్కుపోతారని వ్యాఖ్యానించారు. వచ్చే ప్రజలను, అభిమానులను అదుపు చేయలేక తన సెక్యూరిటీ అలసిపోతారని అన్నారు. ‘రోడ్లపైకి నేను రావాలంటే ఇన్ని ఆలోచించాలి. అలా అని నేను రాకుండా ఉండను’ అని స్పష్టం చేశారు.