rajeev khelratna: అమరీందర్ ప్రభుత్వం నిర్వాకం వల్లే నాకు ఖేల్‌రత్న రాలేదు: హర్భజన్ సింగ్
- తన అధికారిక యూట్యూబ్‌లో వీడియో సందేశం ఉంచిన క్రికెటర్
- నామినేషన్ పత్రాలు సకాలంలో పంపలేదు
- అందుకే కేంద్రం దాన్ని వెనక్కి పంపింది
పంజాబ్‌లోని అమరీందర్ సింగ్ ప్రభుత్వం నిర్వాకం వల్లే తనకు 'ఖేల్‌రత్న' రాకుండా పోయిందని టీమిండియా ఆటగాడు, స్పిన్నర్ హర్భజన్‌సింగ్ మండిపడ్డారు. తన నామినేషన్ పత్రాలను సకాలంలో పంపడంలో పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం వాటిని తిరస్కరించిందని ఆరోపించారు. ఈ మేరకు హర్భజన్ ఓ వీడియోను తన అధికారిక య్యూట్యూబ్ చానల్‌లో ఉంచాడు.
‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి నా పేరును సూచిస్తూ పంజాబ్ ప్రభుత్వం పంపిన నామినేషన్ తిరస్కరణకు గురైందని మీడియా ద్వారా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇందుకు పంజాబ్ ప్రభుత్వానిదే బాధ్యత. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిని కోరుతున్నాను. జాప్యానికి కారణం ఏమిటి? ఎక్కడ ఆలస్యం జరిగింది? తక్షణం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.
తాను మార్చి 20వ తేదీనే తన నామినేషన్ వివరాలన్నీ ప్రభుత్వానికి సమర్పించానని, కానీ వారు కేంద్రానికి పంపడంలో జాప్యం చేశారని భజ్జీ ఆరోపించారు. ఇటువంటి చర్యల వల్ల ఆటగాళ్లు నిరాశకు గురికావడమేకాక, ప్రభుత్వంపై కూడా నమ్మకం పోతుందని హర్భజన్ విమర్శించారు.