moon: చంద్రుడి వయసెంతో చెప్పిన జర్మనీ శాస్త్రవేత్తలు
- చంద్రుడి వయసుపై గత పరిశోధనలు తప్పు
- 451 కోట్ల సంవత్సరాల క్రితమే పుట్టిన చంద్రుడు
- కొలొగ్నీ యూనివర్సిటీ పరిశోధకులు
చంద్రుడి వయసును నిర్ధారించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ఆసక్తిర విషయం బయటపడింది. 451 కోట్ల సంవత్సరాల క్రితం చందమామ ఏర్పడిందని జర్మనీలోని కొలొగ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విషయంలో గతంలో జరిగిన పరిశోధనల్లో వాస్తవం లేదని తేల్చారు. సౌరవ్యవస్థ ఏర్పడిన 15 కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు ఉద్భవించి ఉంటాడని గత పరిశోధనల్లో శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అయితే, ఆ పరిశోధనల్లో నిజం లేదని, సౌర వ్యవస్థ ఏర్పడిన 5 కోట్ల సంవత్సరాలకే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం తేల్చింది. సౌరవ్యవస్థ 456 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని, ఆ తర్వాత ఐదు కోట్ల సంవత్సరాలకే అంటే 451 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు ఏర్పడ్డాడని కొలొగ్నీ పరిశోధకులు అంచనా వేశారు. చంద్రుడిపై నుంచి అపోలో మిషన్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్‌లు సేకరించి తీసుకొచ్చిన నమూనాలను విశ్లేషించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. కాగా, తాజా అధ్యయనం వివరాలు నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.