Prithvi Shaw: సాధారణ దగ్గుమందు వాడి డోప్ టెస్టులో విఫలమైన భారత యువ క్రికెటర్
- యువ సంచలనం పృథ్వీ షాకు డోప్ టెస్టు
- పృథ్వీ షా శాంపిల్స్ లో నిషిద్ధ టర్బుటాలైన్ ఆనవాళ్లు
- నవంబర్ 15 వరకు సస్పెండ్ చేసిన బీసీసీఐ
భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుగాంచిన ముంబయి యువ సంచలనం పృథ్వీ షా అనూహ్యరీతిలో డోప్ టెస్టులో విఫలమయ్యాడు. పృథ్వీ షా వాడిన దగ్గుమందులో నిషిద్ధ ఉత్ప్రేరకం ఉండడంతో అతడి నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఆ ఉత్ప్రేరకం ఆనవాళ్లు బయటపడ్డాయి. డోప్ టెస్టులో విఫలం కావడంతో నిబంధనల ప్రకారం పృథ్వీ షాపై సస్పెన్షన్ విధించారు. నవంబర్ 15 వరకు పృథ్వీ షా ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
డోపింగ్ నిబంధనలను పృథ్వీ షా ఉల్లంఘించినట్టు తేలిందని, అతడి శాంపిల్స్ లో కనిపించిన టెర్బుటాలైన్ సాధారణంగా వాడే దగ్గుమందుల్లో కూడా ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. అయితే, టెర్బుటాలైన్ అంతర్జాతీయంగా నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో ఉండడంతో పృథ్వీ షాను సస్పెండ్ చేస్తున్నట్టు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, దీనిపై స్పందించిన పృథ్వీ షా, నిబంధనలను పాటించాల్సిందేనని, ఈ ఘటన ద్వారా ఇతర యువ క్రికెటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.
స్వల్ప అనారోగ్యాలకు కొన్ని సాధారణ ఔషధాలను వాడుతుంటామని, వాటిద్వారా మనకు తెలియకుండానే కొన్ని పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయని పృథ్వీ షా వివరించాడు. అలాంటి ఔషధాల పట్ల పరిజ్ఞానం కలిగివుండడం ఎంతో అవసరమని ఈ ఘటన నిరూపిస్తోందని తెలిపాడు. ఈ నిషేధం అనంతరం తాను మరింత దృఢవైఖరితో తిరిగొస్తానని ఓ ప్రకటనలో వెల్లడించాడు.