Tipu Sultan: టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేసిన యడియూరప్ప సర్కార్
- అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్న యెడ్డీ సర్కార్
- టిప్పు ఉత్సవాలు జరపరాదంటూ కన్నడ, సాంస్కృతిక శాఖలకు ఆదేశాలు
- హిందూ వ్యతిరేకి టిప్పు సుల్తాన్ అని విమర్శిస్తున్న బీజేపీ
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం తనదైన శైలిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. ఉత్సవాలను జరపరాదని కన్నడ, సాంస్కృతిక శాఖలను ఆదేశించింది.
ప్రతి ఏటా నవంబర్ 10న టిప్పు జయంతి ఉత్సవాలు కర్ణాటకలో జరుగుతుంటాయి. 2014 నుంచి కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే, ఈ ఉత్సవాలను హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని బీజేపీ కూడా మొదటి నుంచి వాదిస్తోంది. గత ఏడాది కూడా టిప్పు ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్సవాలను అడ్డుకుంటామని బీజేపీ కూడా ప్రకటించడంతో... పలు చోట్ల 144 సెక్షన్ విధించారు.