Sidhartha: ఇక పోరాడే ఓపిక లేదు... అదృశ్యమైన ఘటనకు ముందు ఉద్యోగులకు 'కేఫ్ కాఫీ డే' సిద్ధార్థ లెటర్!

  • జరిగిన తప్పులకు నాదే బాధ్యత
  • డీల్స్ గురించి మేనేజ్ మెంట్ కు తెలియదు
  • ఎవరినీ మోసం చేయాలనుకోలేదన్న సిద్ధార్థ

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన ఘటనకు ముందు తన ఉద్యోగులకు రాసిన లేఖ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఆయన అదృశ్యమైన తరువాత దాదాపు 300 మంది గజఈతగాళ్లతో నదిలో వెతికిస్తున్నా, ఇంతవరకూ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇక తన ఉద్యోగులు, కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు రాసిన లేఖలో ఆయన పలు విషయాలను చర్చించారు.

తన కృషితో 30 వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించానని, ఎంత ప్రయత్నించినా సంస్థను లాభాల్లోకి నడపలేకపోయానని వాపోయారు. ఇక పోరాడే ఓపిక లేదని, అందుకే అన్నీ వదిలేస్తున్నానని, తనను క్షమించాలని అన్నారు. ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేకున్నానని చెప్పారు.

కొత్త యాజమాన్యానికి ఉద్యోగులంతా సహకరించాలని, వ్యాపారాన్ని కొనసాగించాలని సూచించారు. ఆదాయపు పన్ను మాజీ డైరెక్టర్ జనరల్ తనను ఎంతో వేధించారని ఆరోపించారు. జరిగిన తప్పులన్నింటికీ తనదే బాధ్యతని, తాను జరిపిన డీల్స్ గురించి మేనేజ్‌మెంట్‌ కు, ఆడిటర్లకు తెలియదని చెప్పారు. తాను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదని, చివరకు తాను విఫలమైన వ్యాపారవేత్తగా మిగిలానని చెప్పారు. కాగా, సిద్ధార్థ అదృశ్యం గురించి తెలియగానే ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ తదితరులు ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆయన్ను పరామర్శించారు.

Sidhartha
SM Krishna
Sucide
Karnataka
Cafe Coffee Day
  • Loading...

More Telugu News