Triple Talak: నేడు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. సర్వత్ర ఉత్కంఠ!
- ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
- రాజ్యసభలో బిల్లు పాసైతే.. చట్టరూపం దాల్చుతుంది
- బిల్లు ఆమోదం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ
ముస్లిం మహిళలకు భద్రతను చేకూర్చేందుకు తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వస్తోంది. రాజ్యసభలో బిల్లుకు ఆమోదముద్ర పడితే... ఇది చట్టరూపం దాల్చుతుంది. మరోవైపు, బీజేపీకి రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో... ఈ బిల్లు గట్టెక్కుతుందా? లేదా? అనే సంశయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ సభ్యులందరూ సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.
రాజ్యసభలో బిల్లుకు 114 మంది సభ్యులు మద్దతు తెలుపుతుండగా... 118 మంది వ్యతిరేకిస్తున్నారు. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో కొందరు చివరి క్షణంలో మద్దతు ప్రకటిస్తే బిల్లు గట్టెక్కే అవకాశం ఉంది. మరోవైపు, బిల్లు ఆమోదం కోసం విపక్ష సభ్యులతో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నవారిలో ఎన్డీయే భాగస్వామి జేడీయూ కూడా ఉండటం గమనార్హం. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. వీటిలో కొన్ని పార్టీలు బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తుండగా... మరికొన్ని పార్టీలు బిల్లులోని కొన్ని అంశాలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు ఓటింగ్ సమయంలో వాకౌట్ చేసినా బిల్లు గట్టెక్కే అవకాశం ఉంది.
బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవడానికి యత్నిస్తున్న బీజేపీ... లింగ సమానత్వం కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నామని చెబుతోంది. వీటన్నింటి నేపథ్యంలో, ఈరోజు రాజ్యసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది.