Unnao: ఉన్నావో అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం
- రాయ్‌బరేలీ వద్ద కారును ఢీకొన్న లారీ
- లారీ నంబరు ప్లేటుకు నల్ల రంగు పూసి ఉండడంతో అనుమానాలు
- ఎస్పీ నేత పేరుపై రిజస్టరైన లారీ
రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు గాయపడిన ఘటనకు సంబంధించిన కేసులో కొత్తకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు.. అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత నందుపాల్ పెద్ద సోదరుడు దేవేంద్ర పాల్‌దిగా గుర్తించారు.
అత్యాచార బాధితురాలిపై జరిగింది ప్రమాదం కాదని, హత్యాయత్నమన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతిపక్షాలు, బాధితురాలి తల్లి దీనిని ప్రమాదంగా అంగీకరించేందుకు నిరాకరించారు. ప్రమాదం వెనక నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో కుల్దీప్, ఆయన సోదరుడితోపాటు మరో ఎనిమిదిమందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
19 ఏళ్ల ఉన్నావో అత్యాచార బాధితురాలు కుటుంబ సభ్యులు, లాయర్‌తో కలిసి కారులో వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ లారీ రాయ్‌బరేలీ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాధితురాలు, లాయర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కారును ఢీకొన్న ట్రక్ నంబరు ప్లేటుకు నల్ల రంగు పూసి ఉండడంతో అనుమానాలు బలపడ్డాయి. తాజాగా, ఆ లారీ ఎస్పీ నేతదని దర్యాప్తులో తేల్చారు.