unnao: మీపై అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు: రాహుల్ వ్యంగ్యం
- ఉన్నావో అత్యాచార బాధితురాలికి రోడ్డు ప్రమాదం
- ఆమె బంధువులు ఇద్దరు మృతి
- ఘాటుగా స్పందించిన రాహుల్ గాంధీ
ఉన్నావో అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. మీపై అత్యాచారానికి పాల్పడింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ఎంతమాత్రమూ ప్రశ్నించొద్దని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘‘భారతీయ మహిళల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బులెటిన్. మీపై అత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు’’ అని ట్వీట్ చేశారు.
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో కారులో ఆమెతోపాటు ఉన్న బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అది ప్రమాదం కాదని, ఈ ఘటన వెనక అత్యాచార నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెనగర్ హస్తం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేసి మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బేటీ పడావో.. బేటీ బచావో’ పథకాన్ని ప్రశ్నించారు. కాగా, అది రోడ్డు ప్రమాదమేనని, ఈ ఘటనపై అనుమానాలు అవసరం లేదని యూపీ పోలీసులు స్పష్టం చేశారు.