Telangana: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. నేడు, రేపు కూడా!
- నాలుగు రోజులుగా వర్షాలు
- ఆదిలాబాద్ జిల్లాలో 9 గంటల వ్యవధిలోనే 133.5 మిల్లీమీటర్ల వర్షపాతం
- తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు.. విద్యుత్‌కు తగ్గిన డిమాండ్
ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, రాజస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 23.9 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలోని వాగులు పొంగడంతో గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటల వ్యవధిలోనే కుమురం భీం జిల్లా బెజ్జూరులో ఏకంగా 133.5 మిల్లీమీటర్లు, రవీంద్రనగర్‌లో 122.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తెరిపినివ్వకుండా కురుస్తుండడంతో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. హన్మకొండలో సోమవారం సాధారణం కంటే 6.1 డిగ్రీల తక్కువ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో ఇలాగే 4.8 డిగ్రీలు తగ్గి 25.6 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది.