cm: కాపు రిజర్వేషన్ల అంశంపై మా వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదు: సీఎం జగన్
- బీసీల హక్కులకు భంగం కలగకూడదు
- కాపు రిజర్వేషన్లపై టీడీపీవి స్వార్థ రాజకీయాలు
- చంద్రబాబు చర్యలతో కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తింది
కాపు కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కాపు రిజర్వేషన్లపై తాజా పరిణామాలను సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల అంశంపై తమ వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగా బీసీల హక్కులకు భంగం కలగకుండా, బీసీలకు నష్టం లేకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
స్వార్థ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ యత్నిస్తోందని, చంద్రబాబు చర్యలతో కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. చంద్రబాబు నామమాత్రంగా కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఇచ్చిన 5 శాతం కోటా పైనా కోర్టులో కేసులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో అడుగు ముందుకేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు.