Andhra Pradesh: సినీ నటుడు శివాజీ తీరును తప్పుపట్టిన సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి!
- శివాజీ తన వాదనల్ని వినిపించడం సరైనదే
- కానీ అసలు కంటే కొసరు విషయాలను ఆయన చెప్పారు
- పర్సనల్ గొడవను రాష్ట్రాల సమస్యగా చెబుతున్నారు
సినీ నటుడు శివాజీ అమెరికాకు వెళుతుంటే దుబాయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆయన్ను అడ్డుకుని భారత్ కు తిప్పిపంపించారంటూ వార్తలు రావడం, ఇందులో వాస్తవం లేదని, ఇలాంటి వార్తలు సృష్టించి కొందరు కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారనీ శివాజీ వివరణ ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే, ఇటీవల కుమారుడి కాలేజీ పనుల నిమిత్తం అమెరికాకు వెళుతుండగా హైదరాబాదు పోలీసులు తనను అడ్డుకున్నారని శివాజీ తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో శివాజీ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో శివాజీ తన వాదనను తాను వినిపించారనీ, ఇది స్వాగతించదగ్గ పరిణామమని రవి తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో అలంద మీడియా కేసు విషయాలు కాకుండా ఇతర విషయాలను శివాజీ ఎక్కువగా మాట్లాడారని విమర్శించారు.
అక్కడితో ఆగకుండా కొందరిని మూర్ఖులని తిట్టడం మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. టీవీ9 అమ్ముతారని మీడియా ఛానళ్లలో, పలు పత్రికల్లో కథనాలు వచ్చాయనీ, కాని ఈ విషయం తనకు తెలియదని టీవీ9 మాజీ సీఈవో స్నేహితుడైన శివాజీ చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు.
ఒకవేళ రవిప్రకాష్ షేర్లను బదిలీ చేయకుంటే శివాజీ రవిప్రకాష్ ను లేదా కొత్త యాజమాన్యాన్ని అడగాలనీ, కానీ శివాజీ మాత్రం టీవీ9 అమ్మకపు డీల్ ను ఆపాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాపార వివాదంలోకి గోదావరి జలాలు, రాజధాని సమస్యలు తీసుకురావడం ఏమిటని అడిగారు. తమ వ్యక్తిగత పోరాటాన్ని ఆంధ్రా ప్రజల పోరాటంగా, ఏపీ-తెలంగాణల మధ్య వివాదంగా చూపించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.