Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కాపులకు రిజర్వేషన్ పై త్రిసభ్య కమిటీ ఏర్పాటు!

  • కమిటీలో కన్నబాబు, ఉమ్మారెడ్డి, అంబటి
  • ఈరోజు కాపు నేతలతో ఏపీ సీఎం భేటీ
  • కేంద్రం లేఖకు చంద్రబాబు జవాబు ఇవ్వలేదని వ్యాఖ్య

కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీలో ప్రస్తుతం రగడ నడుస్తోంది. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ప్రతిపక్ష టీడీపీతో పాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు నష్టనివారణ చర్యలకు దిగింది. కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించడం, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై త్రిసభ్య కమిటీని నియమించింది.

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును కమిటీ సభ్యులుగా నియమిస్తూ సీఎం జగన్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వైసీపీ కాపు నేలతో జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ 4న కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ కేంద్రం లేఖ రాసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరిందన్నారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎలాంటి జవాబు చెప్పలేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chief Minister
Jagan
KAPU RESERVATION
Three member committee
  • Loading...

More Telugu News