Andhra Pradesh: విధేయతకు పెద్దపీట.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా!
- వైఎస్ కుటుంబానికి విధేయుడిగా జక్కంపూడి
- 2009 తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కుటుంబం
- కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధేయతకు పెద్దపీట వేశారు. తాజాగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఏపీ కాపుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ఆర్టీ 234 నంబర్ తో ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) జారీచేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా రెండేళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో కాపులకు ఏటా రూ.2,000 కోట్లు కేటాయిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లకు గానూ ప్రభుత్వం కాపుల కోసం రూ.10,000 కోట్లు వెచ్చించనుంది. ఈ గురుతర బాధ్యతను జగన్ జక్కంపూడి రాజాకు అప్పగించారు. జక్కంపూడి రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరు పొందారు.
వైఎస్ కేబినెట్ లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. వైఎస్, రామ్మోహన్ రావుల మరణం తరువాత జక్కంపూడి కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీకి అండగా నిలిచింది. 2019 ఎన్నికల్లో తల్లి విజయలక్ష్మిని కాదని కుమారుడు జక్కంపూడి రాజాకు జగన్ టికెట్ కేటాయించారు.