Azam Khan: రమాదేవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు లోక్ సభలో క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్
- పానెల్ స్పీకర్ రమాదేవిపై ఆజంఖాన్ దారుణ వ్యాఖ్యలు
- ఆజంఖాన్ కు పలు చెడు అలవాట్లు ఉన్నాయన్న రమాదేవి
- తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఆజంఖాన్
లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమాదేవిపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సభలో ఆజంఖాన్ అటూఇటూ చూస్తూ మాట్లాడుతుండగా... తనవైపు చూసి మాట్లాడాలని ఆ రోజు చైర్ లో వున్న పానెల్ స్పీకర్ రమాదేవి సూచించారు. దీనికి సమాధానంగా, 'నాకు కూడా మీ కళ్లలోకి చూస్తూ మాట్లాడాలనే ఉంది' అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆజంఖాన్ వ్యాఖ్యలపై రమాదేవి మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు మహిళలనే కాకుండా పురుషులను కూడా బాధించేలా ఉన్నాయని అన్నారు. ఈ విషయం ఆయనకు అర్థం కావడం లేదని... ఆయనకు పలు చెడు అలవాట్లు ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను వినడానికి తాను పార్లమెంటుకు రాలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు లోక్ సభలో ఆజంఖాన్ మాట్లాడుతూ, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. 'సిస్టర్... నాకు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నేను చెడుగా మాట్లాడే అవకాశమే లేదు. నా వ్యాఖ్యల్లో ఒక్క తప్పు పదం ఉన్నా... ఎంపీ పదవికి రాజీనామా చేస్తా' అని చెప్పారు. తన మాటలు బాధించి ఉంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు.