Alpita Chaudhary: విచిత్రం అంటే ఇదే మరి.. స్వయంగా టిక్‌టాక్ చేస్తూ దొరికిన గుజరాత్ మహిళా డీఎస్పీ

  • టిక్‌టాక్ చేసిందని కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన డీఎస్పీ
  • వివరణ ఇచ్చిన మంజిత వంజారా
  • తన స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదన్న డీఎస్పీ

కోడలికి సుద్దులు చెప్పిన అత్త ఏదో చేసిందట.. అలానే ఉంది గుజరాత్ డిప్యూటీ ఎస్పీ మంజిత వంజారా వ్యవహారం. పోలీస్ స్టేషన్ లాకప్ వద్ద టిక్‌టాక్ చేసిన మహిళా కానిస్టేబుల్ అల్పిత చౌదరిని సస్పెండ్ చేసిన వంజారా స్వయంగా టిక్‌టాక్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పంజాబీ పాటకు స్నేహితురాలితో కలిసి వంజారా హుషారుగా స్టెప్పులేస్తూ కనిపించారు.

వంజారా వీడియోపై నెటిజన్లు ఫైరవుతున్నారు. టిక్‌టాక్ చేసిందని అల్పితను సస్పెండ్ చేసిన డీఎస్పీ స్వయంగా తానే ఇలా టిక్‌టాక్ వీడియో చేయడం దారుణమని విమర్శిస్తున్నారు. టిక్‌టాక్‌ వీడియో చేసిన ఆమెపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, అల్పిత చౌదరి సస్పెన్షన్‌పై డీఎస్పీ వంజారా వివరణ ఇచ్చారు. టిక్‌టాక్ చేసినందుకు ఆమెను సస్పెండ్ చేయలేదని, విధుల్లో ఉండీ యూనిఫాం ధరించనందుకే సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. తన వీడియోపై వంజారా వివరణ ఇస్తూ.. ఆ వీడియో క్లిప్ రెండు నెలల క్రితం నాటిదని పేర్కొన్నారు. తానేమీ తప్పు చేయలేదని, అసలు ఆ వీడియోను తాను అప్‌లోడ్ చేయలేదన్నారు. తాను మంచి కూచిపూడి డ్యాన్సర్‌నని, వంట కూడా బాగా చేస్తానని చెప్పుకొచ్చారు. తాను విధుల్లో లేనప్పుడు మాత్రమే ఇటువంటి పనులు చేస్తానని, తన స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని డీఎస్పీ తేల్చి చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News