IRCTC: రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం తగ్గుతున్న క్యూలైన్లు... ఇదంతా మొబైల్ మహిమ!

  • అందుబాటులోకి వచ్చిన ఐఆర్సీటీసీ మొబైల్ యాప్
  • సాధారణ తరగతి టికెట్లు, ప్లాట్ ఫామ్ టికెట్ల బుకింగ్ కూడా
  • ప్రజల్లో మరింతగా అవగాహన పెంచుతామంటున్న అధికారులు

రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం కనిపించే క్యూలైన్లు క్రమంగా తగ్గుతున్నాయి. రైలు బయలుదేరే సమయానికి గంట ముందు స్టేషన్ కు చేరుకున్నా టికెట్ లభిస్తుందో లేదో నన్న భయాలు తగ్గుతున్నాయి. రిజర్వేషన్‌ టిక్కెట్లను, జనరల్ తరగతి టికెట్లను కౌంటర్ల వద్దకు వెళ్లకుండానే ఎక్కడి నుంచి అయినా ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే సౌలభ్యం దగ్గర కావడమే ఇందుకు కారణం. మొబైల్‌ టిక్కెట్‌ సేవలు అందుబాటులోకి రాగా, వినియోగదారులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.

ఉదాహరణకు గుంటూరు రైల్వే డివిజన్‌ విషయమే తీసుకుంటే, మొబైల్ టికెట్ సేవలు అందుబాటులోకి వచ్చిన వేళ, నెలకు సుమారు రూ. 5 వేలుగా ఉన్న ఆదాయం ఇప్పుడు సుమారు రూ. 5 లక్షలకు పెరిగింది. ఇది సమీప భవిష్యత్తులోనే రూ. 10 లక్షలకు పెరుగుతుందని అంచనా. ప్రయాణ టిక్కెట్లతో పాటు ప్లాట్‌ ఫామ్ టిక్కెట్లను కూడా మొబైల్‌ లోనే బుక్ చేసుకునే సౌలభ్యం కూడా కౌంటర్ల వద్ద క్యూలైన్ తగ్గేలా చేసింది.

స్మార్ట్ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం గత సంవత్సరం ఏప్రిల్ లో ప్రారంభం కాగా, గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో తొలి నెలలో కేవలం 96 టిక్కెట్‌లు బుకింగ్‌ అయ్యాయి. ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 15 వేలు దాటింది. ఆదాయం సైతం రూ. 6,065 నుంచి 4.29 లక్షల రూపాయలకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింతగా పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ చెబుతోంది.

  • Loading...

More Telugu News