Hero: వాళ్లకూ పిల్లలు ఉన్నారు..ఆ పాపం వదులుతుందా?: హీరో శివాజీ
- మా అబ్బాయిని బాగా చదివిద్దామనుకున్నా
- చదువు పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకున్నా
- దానికి గండి కొట్టారు..కామెడీ చేశారు
అలందా మీడియా కేసులో సినీ నటుడు శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అమెరికాకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వస్తున్న అసత్య కథనాల నేపథ్యంలో శివాజీ ఘాటుగా స్పందించారు. తన కొడుకు చదువు పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆటంకం కల్గించారని తన బాధను వ్యక్తం చేశారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, తమది చాలా చిన్నకుటుంబం అని, తన తండ్రి తనను బాగా చదివించాలని బాగా ప్రయత్నం చేశారని, అరకొర చదువులతో సరిపెట్టానని గుర్తుచేసుకున్నారు.
తన కొడుకును సినిమా యాక్టర్ నో, రాజకీయనాయకుడినో చేయాలనుకోలేదని, ‘వాడిని బాగా చదివిద్దాం. మా ఫ్యామిలీలో ఇంకో నెక్స్ట్ లెవెల్ చూసిన మనిషిని చూద్దాం అని అనుకున్నాను. దాన్ని గండి కొట్టారు. దాన్ని కామెడీ చేశారు. మెగా కృష్ణారెడ్డికి పిల్లలు ఉన్నారు. రామేశ్వరరావు గారికి పిల్లలు ఉన్నారు. ఎవరైతే విమర్శించారో వాళ్లందరికీ పిల్లలు ఉన్నారు. ఆ పాపం ఊర్కే వదులుతుందా?’ అని ప్రశ్నించారు.
తనకు కనుక కులపిచ్చి ఉండి రాజకీయాలు చేసి ఉంటే, చంద్రబాబునాయుడు స్థాయికి ఏమాత్రం తీసిపోని రాజకీయనాయకుడిని అయ్యేవాడినని, తనకు దేవుడు అంత శక్తిని ఇచ్చాడని శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డిని కానీ తట్టుకోవాలంటే రాజకీయాలు చేయాలా అని ఆలోచిస్తున్నానని శివాజీ చెప్పడం గమనార్హం.