Mumbai: ముంబయిలో ఈదురుగాలుల బీభత్సం... విమానం ఇంజిన్ ను ఢీకొన్న ఖాళీ కంటెయినర్
- భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబయి
- విమానాశ్రయంలో పెనుగాలులకు ఎగిరిపడిన ఖాళీ కంటెయినర్
- విమానం ఇంజిన్ కు డ్యామేజీ
ముంబయి నగరంలో ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో నీట మునిగిన ముంబయి మహానగరంలో మరో 48 గంటలపాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షం కారణంగా నానా అవస్థలు పడుతున్న ముంబయి వాసులను ఈదురుగాలులు హడలెత్తిస్తున్నాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో బలమైన గాలులు వీయడంతో ఓ విమానం ఇంజిన్ దెబ్బతిన్నది. పెనుగాలులు వీయడంతో మరో విమానానికి చెందిన ఖాళీ కంటెయినర్ పక్కనే ఉన్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విస్తారా ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ కు డ్యామేజి జరిగింది. కంటెయినర్ ఢీకొన్న సమయంలో విమానంలో సిబ్బంది గానీ, ప్రయాణికులు గానీ ఎవరూ లేరు. కాగా, దెబ్బతిన్న విమానాన్ని షెడ్డుకు తరలించి, సర్వీసును రీషెడ్యూల్ చేసి నడపనున్నారు.