Rishabh Pant: తనను ధోనీ వారసుడిగా పేర్కొనడంపై రిషభ్ పంత్ వ్యాఖ్యలు
- విండీస్ టూర్ కు ధోనీ దూరం
- ప్రధాన వికెట్ కీపర్ గా విండీస్ టూర్ కు ఎంపికైన పంత్
- మీడియా కథనాలను పట్టించుకోవడంలేదంటూ వెల్లడి
- దేశం కోసం ఆడడమే తనకు ఇష్టమని వ్యాఖ్యలు
భారత క్రికెట్ పై ఎంఎస్ ధోనీ వేసిన ముద్ర అపారం. అన్ని ఫార్మాట్లలో వరల్డ్ టైటిల్స్ నెగ్గడమే కాకుండా టెస్టుల్లోనూ టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ధోనీ రిటైర్మెంటు వార్తలు వినిపిస్తున్న తరుణంలో అతడి స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడిగా ఢిల్లీ యువసంచలనం రిషభ్ పంత్ తెరపైకి వచ్చాడు. తనను వికెట్ కీపింగ్ దిగ్గజం ధోనీ వారసుడిగా పేర్కొనడం పట్ల పంత్ స్పందించాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం సామాన్యమైన విషయం కాదని, దీన్నో సవాలుగా తీసుకుంటానని తెలిపాడు.
ధోనీ వారసుడు అంటూ మీడియాలో వస్తున్న కథనాల పట్ల తాను ఆలోచించడం మొదలుపెడితే సమస్యలు తప్పవని అన్నాడు. అందుకే తాను జట్టుకు ఏంచేయగలనో దానిపైనే శ్రద్ధ చూపిస్తానని, దేశం కోసం మెరుగైన ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటానని తెలిపాడు. ఇదే తన మొదటి ప్రాధానత్య అని అన్నాడు. నేర్చుకోవాల్సిన, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడుతున్నానని పంత్ చెప్పాడు. వెస్టిండీస్ టూర్ కు వెళ్లే టీమిండియాలో 21 సంవత్సరాల రిషభ్ పంత్ కు ప్రధాన వికెట్ కీపర్ స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ కు ధోనీ దూరంగా ఉన్నాడు.