Mekathoti Sucharitha: స్వల్ప అంతరాయాలను విద్యుత్ కోతలుగా భావించొద్దు: మంత్రి సుచరిత
- గుంటూరులో మీడియా సమావేశం
- విపక్ష ఆరోపణలు నమ్మవద్దని చెప్పిన హోంమంత్రి
- రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతల్లేవంటూ స్పష్టీకరణ
రాష్ట్రంలో వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయాలు కలుగుతున్నాయని, వాటిని విద్యుత్ కోతలుగా భావించవద్దని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయ శాతాన్ని గత సర్కారుతో పోలిస్తే చాలావరకు తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అవన్నీ అసత్యాలేనని అన్నారు. గృహ అవసరాలకు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామని మంత్రి వివరించారు.