Andhra Pradesh: బాలయ్య 500 ఎకరాల వ్యవహారం.. ఘాటుగా స్పందించిన అల్లుడు నారా లోకేశ్!
- అమరావతిలో బాలకృష్ణకు 500 ఎకరాలు ఉన్నట్లు కథనాలు
- ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతలు
- సీఎం జగన్ లక్ష్యంగా లోకేశ్ ఘాటు విమర్శలు
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన బంధువులు అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలు కొన్నట్లు ఓ పత్రికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతుందని వైసీపీ ముఖ్యనేతలు ప్రకటించారు. తాజాగా ఈ విషయమై తెలుగుదేశం ఎమ్మెల్సీ, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
వైసీపీ వాళ్లు అధికారంలోకి వచ్చినా అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావిస్తున్నారని చురకలు అంటించారు.
తండ్రి అధికారాన్ని, శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర వైఎస్ జగన్ దని లోకేశ్ విమర్శించారు. కానీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏరోజు కూడా అటువైపు చూడకుండా స్వచ్ఛమైన మనసు, నీతి, నిజాయితీతో బాలకృష్ణ ఎదిగారని ప్రశంసించారు.
అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలనీ, లేదంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.