India: కశ్మీర్ లో బలగాల మోహరింపుపై ఉగ్రవాదుల ఆగ్రహం.. భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్ర!
- కశ్మీర్ లో మరో 10 వేల మంది జవాన్ల మోహరింపు
- కేంద్రం నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న ఉగ్రవాదులు
- బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు దాడికి ప్లాన్
- హెచ్చరించిన నిఘావర్గాలు.. అప్రమత్తమైన కేంద్రం
జమ్మూకశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ 10,000 మంది జవాన్లను అదనంగా పంపాలని ఇటీవల నిర్ణయించింది. దీంతో భారత బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారు. ఈ 100 కంపెనీల బలగాలు కశ్మీర్ కు చేరుకునేలోపే భారీస్థాయిలో మారణహోమం సృష్టించాలని ప్రణాళికలు రచించారు. ఇందుకోసం కశ్మీర్ లోని భారత బలగాల స్థావరాలు, ఆయుధ డిపోలు లక్ష్యంగా దాడులకు తెగబడాలని ఉగ్రమూకలు నిర్ణయించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
దీంతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్రమత్తమయ్యారు. కశ్మీర్ లోని కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉగ్రమూకలు ఏ క్షణమైనా ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశమున్నందున బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సరిహద్దులో గాలింపును ముమ్మరం చేయాలనీ, చొరబాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.