High Court: తన కారుకు దారివ్వలేదని కానిస్టేబుల్‌తో యూనిఫాం విప్పించిన జడ్జి.. తీవ్రంగా స్పందించిన హైకోర్టు

  • డ్రైవర్‌ను తన గదికి పిలిచి దుస్తులు విప్పించి నిల్చోబెట్టిన జడ్జి
  • రాజీనామా చేసిన బాధిత కానిస్టేబుల్
  • జడ్జిని బదిలీ చేసిన హైకోర్టు

తన కారుకు దారివ్వలేదన్న కోపంతో కానిస్టేబుల్ యూనిఫాం విప్పించిన జడ్జిపై బదిలీ వేటు పడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు జడ్జిపై బదిలీ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ ఘరేలాల్ ఇద్దరు విచారణ ఖైదీలను, ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసు వ్యానులో ఎక్కించుకుని కోర్టుకు బయలుదేరాడు. మరో వంద మీటర్లు ప్రయాణిస్తే వ్యాను కోర్టుకు చేరుకుంటుందనగా వెనక జడ్జి కారు వచ్చింది. జడ్జి కారు దారి కోసం హారన్ మోగించినప్పటికీ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వ్యాను డ్రైవర్‌ ఘరేలాల్‌కు దారివ్వడం సాధ్యం కాలేదు.

అనంతరం కోర్టుకు చేరుకున్న జడ్జి ఘరేలాల్‌ను తన గదికి పిలిచి దారివ్వనందుకు చీవాట్లు పెట్టారు. ఆయన యూనిఫాం, బెల్టు విప్పించి అరగంటపాటు నిల్చోబెట్టి అవమానించారు.

38 ఏళ్లుగా సర్వీసులో ఉన్న 58 ఏళ్ల ఘరేలాల్‌ తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేకపోయారు. వెంటనే ఆగ్రా పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్‌ బబ్లూ కుమార్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయనకు వివరించిన ఘరేలాల్ స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు.

ఘరేలాల్‌కు జరిగిన అవమానంపై స్పందించిన ఎస్సెస్పీ బబ్లూకుమార్ జడ్జిపై ఆగ్రా జిల్లా జడ్జి అజయ్ కుమార్ శ్రీవాస్తవకు, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్‌ జైన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ కూడా జడ్జి తీరును తప్పుబట్టారు. పోలీసుల గౌరవ మర్యాదలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఎస్సెస్పీ ఫిర్యాదుపై స్పందించిన  అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్‌ జైన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆగ్రా జడ్జిని బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

High Court
Judge
Uttar Pradesh
Constable
  • Loading...

More Telugu News