USA: అటు పాకిస్థాన్ కు, ఇటు ఇండియాకు... ఆయుధాలు అమ్ముతున్న అమెరికా!
- రూ. 860.75 కోట్లతో పాక్ కు ఆయుధాలు
- రూ. 4,613 కోట్ల విలువైన ఆయుధాలు ఇండియాకు
- కీలక నిర్ణయాలు తీసుకున్న యూఎస్ఏ
అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు పాకిస్థాన్ కు, ఇటు ఇండియాకు అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు అంగీకరించగా, అందుకు ఆమోదముద్ర కూడా లభించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యూఎస్ ను సందర్శించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. పాక్ కు రూ. 860.75 కోట్ల విలువైన ఆయుధాల విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడినట్టు అమెరికా రక్షణ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది.
ఇదే ఒప్పందం కింద గతంలో పాక్ కు విక్రయించిన ఎఫ్ - 16 ఫైటర్ జెట్లను 24 గంటల పాటు పర్యవేక్షించేందుకు 60 మంది కాంట్రాక్టర్లను నియమిస్తామని పేర్కొంది. అయితే, ఈ మొత్తాన్ని పాక్ కు చెల్లించాల్సిందేనని, అందుకు తాము ఆర్థిక సాయం మాత్రం చేయబోమని పేర్కొంది.
ఇక ఇండియా విషయానికి వస్తే, రూ. 4,613 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఇందులో భాగంగా బోయింగ్ సీ - 17 గ్లోబ్ మాస్టర్ సైనిక రవాణా విమానాలకు అవసరమయ్యే పరికరాలను అందించడంతో పాటు సిబ్బందికి శిక్షణ అందించనున్నట్టు వెల్లడించింది. ఈ విమానాలను యుద్ధసమయాల్లో సైన్యాన్ని, వాహనాలను తరలించేందుకు ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే.