Mahalakshmi Express: వరద నీటిలో రైలు... మొత్తం 1,050 మంది క్షేమమేనన్న మహారాష్ట్ర!
- బద్లాపూర్ - వింగనీ మధ్య నదిలో చిక్కుకున్నమహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్
- రంగంలోకి దిగిన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్
- ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చిన అధికారులు
మహారాష్ట్రలోని ఉల్లాస్ నది ఉప్పొంగడంతో బద్లాపూర్ - వింగనీ మధ్య నదిలో చిక్కుకున్నమహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్ రైలులోని 1,050 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ప్రాణనష్టం లేకుండా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడంతో పాటు వారు గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. నిన్న ఈ రైలు వరద నీటిలో చిక్కుకుపోగా, ప్రయాణికులంతా గంటల పాటు భయందోళనలో గడిపారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తినేందుకు ఆహారం, నీరు లేక, బయటకు దిగే వీలు లేక తీవ్ర ఆందోళనకు గురికాగా, రైల్వేశాఖతో పాటు ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన రంగంలోకి దిగి, హెలికాప్టర్లు, ప్రత్యేక బోట్లతో రైలు వద్దకు చేరుకొని ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
ఆపై వీరందరినీ కల్యాణ్ కు సురక్షితంగా తరలించామని, వారి కోసం కొల్హాపూర్ వరకూ ప్రత్యేక రైల్ ను నడిపించామని అధికారులు అన్నారు. కాగా, పుణెను వరుణుడు ముంచెత్తగా, 24 గంటల వ్యవధిలో 7.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. కొంకణ్ బెల్ట్, ముంబై సమీప ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వర్షపు నీరు రోడ్లపై నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో చేరడంతో ముంబై - గోవా రహదారిని మూసివేశారు.