TTD: తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల షెడ్యూల్!
- సెప్టెంబర్ 30 నుంచి బ్రహ్మోత్సవాలు
- అక్టోబర్ 8 వరకూ ఉత్సవాలు
- 4న గరుడసేవ
- ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబరు 30న ప్రారంభమై అక్టోబరు 8 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆపై 29న రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 30వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుందని, అదే రోజు రాత్రి శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
30న రాత్రి పెద్ద శేష వాహనం, అక్టోబర్ 1 ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనం, 2న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 3న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 4న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ సేవ, 5న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 6న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయని, 7న ఉదయం మహా రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 8న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.
ఉదయం వాహన సేవలు 9 నుంచి 11గంటల మధ్య, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, అక్టోబరు 4న అర్ధరాత్రి 12 గంటల వరకూ గరుడసేవ ఉంటుందని, 5న సాయంత్రం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య స్వర్ణ రథోత్సవం జరుగుతుందని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.