kapu reseravation: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేస్తామన్న ప్రభుత్వం
- ఈ విద్యాసంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో అమలు
- ఈడబ్ల్యూఎస్‌లో ఇక కాపుల కోటా లేనట్టే
కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆర్థిక బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించింది. దీనిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశించింది. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ పది శాతం రిజర్వేషన్‌లో ఐదు శాతాన్ని కాపులకు, మిగతా ఐదు శాతాన్ని కాపేతరులకు కేటాయిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.
తాజాగా ఈ చట్టాన్ని సమీక్షించిన జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం వాటిని అమలు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ రిజర్వేషన్లపై వివిధ కోర్టుల్లో కేసులు ఉన్న నేపథ్యంలో కాపులకు ప్రత్యేకంగా ఐదు శాతం కోటా కుదరదని, కేంద్రం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్‌ను యథాతథంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, తొలి విడతగా విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్లపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. విద్యాసంస్థల్లో కాపు రిజర్వేషన్లు ఉండవని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ పరిధిలోని అందరికీ ఈ రిజర్వేషన్లు వర్తించాలని, దానిని వేర్వేరు వర్గాలకు వర్గీకరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.