Jaipal Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత!
- నిమోనియాతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్ లోని స్వగృహానికి తరలించారు. జైపాల్ రెడ్డి మరణం గురించి తెలుసుకున్న బంధుమిత్రులు, అనుచరులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.
1942, జనవరి 16న జన్మించిన జైపాల్ రెడ్డి, కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969 నుంచి 1984 మధ్య నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ, 1977లో జనతా పార్టీలో చేరి కొంతకాలం తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో మహబూబ్ నగర్ నుంచి, 1999, 2004లో మిర్యాలగూడ నుంచి లోకసభ నియోజకవర్గ సభ్యుడిగా గెలిచారు. ఆపై రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగానూ పని చేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు జైపాల్ రెడ్డిని వరించింది. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా, దాన్ని ఏనాడూ అడ్డుగా భావించని జైపాల్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.