Nara Lokesh: హోంమంత్రి సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం సంగతి ఏంటి?: నారా లోకేశ్
- వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు
- టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమన్న యువనేత
- పొనుగుపాడు వ్యవహారంలో హోంమంత్రి ఏం చెబుతారంటూ నిలదీసిన వైనం
గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం తెలిసిందే. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని గ్రామంలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది దుర్మార్గమని ఎలుగెత్తారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా గోడకట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడికెళ్లిందని నిలదీశారు. ఇప్పుడు తమ పార్టీ నేతలు గ్రామంలోకి వస్తే ఎక్కడ వైసీపీ దౌర్జన్యాలు బట్టబయలవుతాయోనని భయపడుతున్నారని, అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
హోంమంత్రి సొంతమండలంలోనే శాంతిభద్రతల పరిస్థితి ఇలావుంటే రాష్ట్రం సంగతి ఇంకెలావుంటుంది? అని లోకేశ్ ట్విట్టర్ లో వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, ఎవరైనా పర్యటించవచ్చని చెబుతున్న హోంమంత్రి పొనుగుపాడు వ్యవహారంపై ఏం చెబుతారని ప్రశ్నించారు.