Medak District: ఆసుపత్రి ఆవరణలోనే పురిటినొప్పులు.. అక్కడే ప్రసవం చేయించిన సిబ్బంది
- అత్యవసర సమయంలో సిబ్బంది స్పందనపై ప్రశంసలు
- చిత్తశుద్ధితో వ్యవహరించారని అభినందనలు
- తల్లీబిడ్డలు క్షేమం
అత్యవసరాన్ని గుర్తించి ఆరు బయటే తమ వైద్యసేవలను చిత్తశుద్ధితో అందించి శెభాష్ అనిపించుకున్నారు మెదక్ జిల్లా తూఫ్రాన్ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న అపప్రధను కాస్తయినా తొలగించే ప్రయత్నం చేసి పలువురి ప్రశంసలు సొంతం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే...జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్యారీలాల్, ఆయన భార్య మహతీదేవి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గర్భిణి అయిన మహతీదేవి తూఫ్రాన్ ఆసుపత్రిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం నెలలు నిండిన ఆమె ఎప్పటిలాగే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి బయలుదేరింది.
ఆటోలో వచ్చిన వారిని ఆసుపత్రికి వందమీటర్ల దూరంలోనే డ్రైవర్ దింపేశాడు. నడుచుకుంటూ వస్తున్న మహతీదేవికి పది మీటర్లు ముందుకు రాగానే తీవ్రమైన నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె పరిస్థితిని గమనించిన సిబ్బంది ప్రసవానికి సంబంధించిన కిట్లతో ఆమె వద్దకు హుటాహుటిన చేరుకున్నారు. ఆరు బయటే ప్రసవాన్ని పూర్తి చేశాక స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. అత్యవసర సమయంలో వైద్య సిబ్బంది ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి చిత్తశుద్ధితో సేవలందించారని, తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారని పలువురు ప్రశంసించారు.
ఇదిలావుండగా, ప్యారీలాల్‌కు ఇప్పటికే ఏడుగురు సంతానం ఉండగా, ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎనిమిదవది. కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకోమంటే, తమ ఊర్లో ఒక జంటకు 18 మంది పిల్లలు ఉన్నారని, ఆ రికార్డు బద్దలు కొట్టాలన్నది తన లక్ష్యమని చెబుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.