Andhra Pradesh: సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. లేదంటే ప్రజలను మోసం చేసినట్లే!: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
- కేంద్రం రూ.6 వేలను ఇస్తోంది
- దీనికి అదనంగా వైసీపీ సర్కారు రూ.12,500 ఇవ్వాలి
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత
రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 అందిస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద వస్తున్న రూ.6 వేలతో కలిపే మొత్తంగా రూ.12,500 అందిస్తామని చెప్పారు. ఈ ప్రకటనను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల హామీ మేరకు జగన్ రైతు భరోసా కింద అన్నదాతలకు రూ.12,500 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ..‘సీఎం జగన్ గారూ.. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్న రూ.6 వేలు కాకుండా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మరో రూ.12,500ను కచ్చితంగా ఇవ్వాలి. రాష్ట్రంలో అప్పులతో అల్లాడిపోతున్న రైతన్నల ఆత్మహత్యల నివారణకు ఈ పెట్టుబడి సాయం ఉపశమనం కలిగిస్తుంది. కేంద్రం ఇస్తున్న మొత్తంతో కలిపి రూ.12,500 ఇస్తే రైతులను మోసం చేసినట్టే అవుతుంది. పునరాలోచించుకోండి’ అని ట్వీట్ చేశారు.