RSS: ముస్లింలకు ఆర్‌ఎస్‌ఎస్ అండ.. హైదరాబాద్‌లో సహాయ కేంద్రం
- ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ప్రారంభం
- షరియా కోర్టు, మసీదు కమిటీల ఆధ్వర్యంలో నిర్వహణ
- బీజేపీ పట్ల ముస్లింల్లో నమ్మకం పెంచేందుకే
ముస్లింలకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) హైదరాబాద్ నగరంలో సహాయ కేంద్రాన్ని నెలకొల్పింది. మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన పాతబస్తీలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించింది.
పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ పట్ల ముస్లింల్లో నమ్మకం పెంచేందుకు ఇదే ఉత్సాహంతో వారికోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి, కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంచ్ జాతీయ కన్వీనర్ రేష్మాహుస్సేన్ తెలిపారు. షరియా కోర్టు, మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పరివార్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రేష్మా వెల్లడించారు. 2024 నాటికి బీజేపీ పట్ల ముస్లింలు పూర్తి విశ్వాసం ప్రకటించేలా వారిలో నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని చెప్పారు.